BhrarhFriends.org.in
Bharath Friends

ప్రతిభకు అభయ హస్తం,
భారత్ ఫ్రెండ్స్‌ చీరాల

16 డిశెంబరు 1991 న ఒక స్నేహితుడి పెళ్ళిలో రూపుదిద్దుకున్న ఆలోచన చీరాలలోని భారత్ ఫ్రెండ్స్‌. స్నేహం అనే భావనను నలుదిశలా వ్యాపింపజేయడం భారత్ ఫ్రెండ్స్‌ ఆశయం. ఈ ఆశయ సాధనకై వారు ఎన్నుకున్న మార్గం విద్యార్ధి దశలోనే పిల్లలకు ఈ స్నేహ భావాన్ని తెలియజేయడం. అందుకై ముందుగా వారి చదువుకు, ఉపాధికి ఇబ్బంది లేకుండా ఆర్ధిక సహాయం అందేటట్లు చూడడం.

108 మంది 6 నుండి 10 వ తరగతి వరకు చదువుకున్న సహ విద్యార్ధులు ఈ భారత్ ఫ్రెండ్స్. వయస్సు 45 సంవత్సరములైనా ఇప్పటికీ ఒకరికొకరు చేదోడువాదోడుగా వుంటూ, చీరాలలోని ప్రతిభను పలువిధాలా ప్రోత్సహిస్తున్నారు. 5 సార్లు ఉచితంగా BSRB కోచింగ్‌ ఇప్పించారు. 50 మంది చక్కటి ఉద్యోగాలలో చేరారు. పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకోసం 1992 లోనే ఒక గ్రంధాలయం ప్రారంభించి నిర్విఘ్నంగా నడుపుతున్నారు. ప్రతినెలా రెండవ శనివారంనాడు చీరాలలోని గీతా సంస్థతో కలిసి ప్రతిభాపరీక్షలను 2006 నుండి నిర్వహిస్తున్నారు. అలాగే, ప్రతినెలా మొదటి ఆదివారం, ప్రకాశం జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తూ అనుభవమున్న ఆటగాళ్ళచేత పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు.

2000 ల సంవత్సరంలో మొదటిసారిగా వెంకటేష్‌ అనే ఒక పేద విద్యార్ధికి ఇంజనీరింగ్‌ చదువుకోటానికై వడ్డీలేని రుణం అందించడం ద్వారా మొదలయింది భారత్ ఫ్రెండ్స్ వారి ఏడ్యుకేషన్‌ లోన్స్ ప్రహసనం. వెంకటేష్ విద్యాభివృద్ది భారత్ ఫ్రెండ్స్ సభ్యులకు మంచి ప్రొత్సాహాన్నిచ్చింది. వెంకటేష్ ఈనాడు అమెరికాలో సంవత్సరానికి 50 లక్షల ఆదాయమున్న ఉద్యోగంలో ఉన్నాడంటే వారి సంతోషంలో అర్ధం ఉంది కదా! 2005 నాటికి 30 మందికి అలా వడ్డీ లేని రుణాలిచ్చి ఉన్నత చదువులకు తోడ్పడ్డారు. 2006 లో చీరాల సమీపంలోని గవినివారి పాలెం శాఖ ఆంధ్రా బ్యాంకు వారు ముందుకు వచ్చి ప్రతిభ ఆధారంగా రుణాలిస్తున్న భారత్ ఫ్రెండ్స్ వారి విధానాన్ని చూసి తమ వారు ఎంపిక చేసిన విద్యార్ధులలో 40 మందికి బ్యాంకు వారి విద్యారుణం అంద జేశారు. అదేయేడు భారత్ ఫ్రెండ్స్ వారు ఇంకో 56 మందికి తమ పద్దతిలో రుణాలిచ్చి ఉన్నత చదువులకు సహకరించారు.

అలా, ఒక ఉన్నత చదువుల విప్లవం మొదలయింది చీరాలలో. 2007 లో చీరాలలో అతి పెద్దదయిన SBI శాఖ వారు కూడా ఈ విప్లవంలో భాగస్వామ్యం తీసుకుంటూ 39 మందికి విద్యారుణం అంద జేశారు. గవినివారి పాలెం శాఖ ఆంధ్రా బ్యాంకు వారు ఇంకో 35 మందికి రుణాలివ్వడంతో దాదాపు 200 మంది చీరాల ప్రాంతం లోని విద్యార్ధులు BTech, MBA, MCA, MBBS, BPharm లాంటి ఉన్నత చదువులను అందుకోగలిగారు.

2008 లో ఈ విద్యా రుణాలను ముందుకు తీసుకెళుతూనే, నెల నెలా ఇబ్బంది లేకుండా వెయ్యి రూపాయల రుణ సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులంతో పనిలేదు, ప్రాంతంతో పనిలేదు, ఇంటర్‌లో 950 పైచిలిలుకు మార్కులు వుంటే చాలు వీరు సహాయాన్ని అందజేస్తారు. వివరాలన్నీ www.bharathfriends.org.in అనే వెబ్‌ సైటులో వుంటాయి. ఈ విద్యాసంవత్సరానికి 400 దాటిన భారత్ ఫ్రెండ్స్ విద్యార్ధులు బాగా చదువుకోవాలనీ, అలానే భారత్ ఫ్రెండ్స్ వారు ఇంకా ఉన్నత స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలనీ ఆశిద్దాం.

మురళీ కృష్ణ వలివేటి,
మేనేజింగ్ డైరెక్టర్,
గీతా, చీరాల.
గీతా.కో.ఇన్

BhrarhFriends.org.in

All Rights   BharathFriends.org.in *****

Site Meter

Site Designed & Developed by   vComNet.co.in